ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జోసెఫ్ రావణ్ భార్య అనూష..
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:48 PM
ఉపా కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రావణ్ భార్య అనూష ఆశ్రయించారు.
అమరావతి: ఉపా (UAPA) కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రావణ్ భార్య అనూష ఆశ్రయించారు. తన భర్తకు సంబంధించి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకుండా నిరోధించాలని పిటిషన్ వేశారు. ఈ మేరకు వీడియోలను ప్రచారం చేయకుండా సైబర్ క్రైమ్ సెల్ ఎస్పీని ఆదేశించాలని హైకోర్టును రావణ్ భార్య కోరారు. తనతో పాటు జోసెఫ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫైళ్లను తిరిగి ఇప్పించాలని అనూష పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను పోలీసులు యాక్సెస్ చేయకుండా, కాపీ చేసి దుర్వినియోగం చేయకుండా చూడాలని అనూష విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌లో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కాకినాడ, కృష్ణా జిల్లాల ఎస్పీలు, గన్నవరం డీఎస్పీ, పిఠాపురం ఎస్సై, సైబర్ క్రైమ్ ఎస్పీలను ప్రతివాదులుగా ఆమె చేర్చారు. కాగా, ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఎప్పుడు చేపడుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట