Share News

అంబటిపై.. జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:23 PM

వైఎస్ జగన్ పార్టీ రాజకీయ పార్టీనా లేక రౌడీల పార్టీనా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటిపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

అంబటిపై.. జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య
Varla Ramaiah On Ambati Rambabu

అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ.. రాజకీయ పార్టీనా? లేక రౌడీల పార్టీనా? అంటూ ప్రశ్నలు సంధించారు. అంబటి రాంబాబు వ్యవహారం హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి ఉపయోగించిన భాష.. సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అతడికి సంస్కారం లేదనడానికి ఇది నిదర్శనమని విమర్శించారు.


ప్రజలకు ఇప్పటికే అంబటి ప్రవర్తన గురించి తెలుసని.. కానీ ఇంత అప్రాచ్యుడని రాష్ట్ర ప్రజలకు తెలియదన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిపై అశ్లీల పదజాలం ప్రయోగించినా.. ఆయన స్థాయిని ఏమాత్రం తగ్గించలేరని వర్ల రామయ్య అన్నారు. అంబటి వాడిన భాషను అతని కుటుంబ సభ్యులు సమర్థిస్తారా? లేక ఛీ కొడతారా? అనే ప్రశ్నను ప్రజల ముందుంచారు. ఇలాంటి వ్యక్తిని భరిస్తున్న కుటుంబ సభ్యుల సహనాన్ని అభినందించాల్సిందేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


గతంలో జగన్ శ్రీమతిపై నోరుజారిన టీడీపీ నేతపై వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలను గుర్తు చేసిన వర్ల రామయ్య.. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో జగన్ ఏం చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే.. అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించినట్లు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.

టీడీపీ వర్గాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే వైసీపీ ప్రయత్నాలు సాగవని వర్ల రామయ్య స్పష్టం చేశారు. అంబటి ప్రవర్తనకు ప్రజలు గత ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పారని, అయినా అతని తీరు మారకపోవడం సిగ్గుచేటన్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఎలాంటి రాజీ పడకూడదని వర్ల రామయ్య పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 04:00 PM