Polavaram Nallamalla Link Project: పోలవరం-నల్లమల ప్రాజెక్టుతో సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jan 11 , 2026 | 06:44 PM
ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఏంసీల నీటిలో.. 200 టీఏంసీలు మాత్రమే తీసుకునేలా పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి నిమ్మల రామనాయుడు వివరించారు. GWDT అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఉన్నతాధికారులకు ఆయన సోదాహరణగా వివరించారు.
అమరావతి, జనవరి 11: సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం నాడు పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు రాజధాని అమరావతిలో ఇవాళ(ఆదివారం) ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా లీగల్ టీమ్‌కు మంత్రి నిమ్మల సూచించారు.
ఈ కేసు విచారణకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీమ్‌కు అందజేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతీ ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఏంసీల నీటిలో.. 200 టీఏంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల వివరించారు. GWDT అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఉన్నతాధికారులకు ఆయన సోదాహరణగా వివరించారు.
గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చునని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నామని మంత్రి నిమ్మల వివరించారు. డీపీఆర్‌కు సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమేనని పేర్కొన్నారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడతామని మంత్రి నిమ్మల ప్రకటించారు.
గోదావరిపై పోలవరం- నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గోదావరి నది ప్రవహించే చివరి రాష్ట్రం ఏపీ. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే ఈ నీరు.. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని వృథాగా సముద్రంలో కలిసే కంటే.. ఆ మిగులు జలాలను పోలవరం- నల్లమల్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ పంపడం.. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.
అయితే ఈ లింక్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. గత విచారణ సందర్భంగా జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహామూర్తి, న్యాయవాదులతోపాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News