PM-ABHIM నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం..
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:54 PM
పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలులో ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం నిధుల వినియోగంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2021 నుంచి 2024 మధ్య కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కొంత భాగం మాత్రమే వినియోగించారని తెలిపింది.
న్యూఢిల్లీ: పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలులో గత వైసీపీ ప్రభుత్వం నిధుల వినియోగంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఈ పథకం కింద కేంద్రం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేదని తెలిపింది.
కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో PM-ABHIM కింద ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన రూ.3.75 కోట్లలో ఒక్క రూపాయి కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని పేర్కొంది. 2021 నుంచి 2024 మధ్య కేంద్రం మొత్తం రూ.55.29 కోట్ల నిధులు అందించగా, కేవలం రూ.35.45 కోట్లను మాత్రమే వినియోగించినట్లు వెల్లడించింది. మూడేళ్ల కాలంలో దాదాపు రూ.20 కోట్ల కేంద్ర నిధులు వినియోగించకుండా మిగిలిపోయాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభావం పడిందని పేర్కొంది.
కూటమి ప్రభుత్వంలో పెరిగిన నిధుల వినియోగం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత PM-ABHIM నిధుల వినియోగం గణనీయంగా పెరిగిందని కేంద్రం వివరించింది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో నిధుల వినియోగం 166 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది. గతంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.20 కోట్ల నిధులను కూడా వినియోగించినట్లు వెల్లడించింది.
నెల్లూరులో ఆరోగ్య వసతుల అభివృద్ధి
PM-ABHIM నిధులతో నెల్లూరు జిల్లాలో పలు ఆరోగ్య మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని కేంద్రం వివరించింది. ఆత్మకూరు ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలాగే నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో రూ.23.75 కోట్ల వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణం పూర్తయిందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read:
దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలు..
విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ నాశనం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్