Share News

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:19 PM

ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బందిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ ఘటనలో స్మగ్లర్ల దాడిలో గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

అమరావతి, సెప్టెంబర్13: ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బందిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ ఘటనలో స్మగ్లర్ల దాడిలో గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. అటవీ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని పేర్కొన్నారు.


ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అటవీ సిబ్బంది గాయపడడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. అటవీ నేరాల నియంత్రణ విషయంలో కూటమి ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారి పల్లి గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆపరేషన్ అరణ్య’ చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లర్లతో వెళ్తున్న వాహనాన్ని అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు.


ఈ సందర్భంగా వారిపై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు. అయినా.. ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. అలాగే ఎర్రచందనం దుంగలు, తూకం యంత్రం, రంపం బ్లేడ్, గొడ్డళ్లతోపాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. ప్రకాష్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పి. రెడ్డి ప్రసాద్, కె. ప్రతాప్‌‌తోపాటు వాహనం డ్రైవర్ చరణ్‌కు గాయాలయాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 06:30 PM