అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:34 AM
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరంటూ మంత్రి నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. వైసీపీ నేతలు దేవుణ్నే రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 23: తిరుమలో కొలువుదీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరంటూ ఈ సందర్భంగా వారికి చురకలంటించారు. దేవుడిని సైతం వైసీపీ రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అభ్యంతరకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణ వెల్లువెత్తాయి. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది సిట్. అయితే ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా.. కూటమి ప్రభుత్వం తమపై అసత్య ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాంటి వేళ అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల క్యూ లైన్‌లో భక్తురాలిని కాటేసిన పాము.. ఆసుపత్రికి తరలింపు
రిటైర్మెంట్ వరకూ సస్పెన్షన్‌లోనే!
For More AP News And Telugu News