Share News

రిటైర్మెంట్‌ వరకూ సస్పెన్షన్‌లోనే!

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:48 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.వి. సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను ప్రభుత్వం జూన్‌ 30వరకూ పొడిగించింది.

రిటైర్మెంట్‌ వరకూ సస్పెన్షన్‌లోనే!

  • ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.వి. సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను ప్రభుత్వం జూన్‌ 30వరకూ పొడిగించింది. ఈ నెల 24 నాటికి ఆయన సస్పెన్షన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నేతృత్వంలో 18న భేటీ అయిన రివ్యూ కమిటీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం నాలుగు కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతున్నందున సస్పెన్షన్‌ ఎత్తివేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా రివ్యూ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌ను తొలగించడం సబబు కాదని ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆయనపై ఉన్న క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ పూర్తయ్యే వరకూ లేదా పదవీ విరమణల్లో ఏది ముందైతే అప్పటి వరకూ సస్పెన్షన్‌లో కొనసాగించాలని కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న ఆభియోగాలపై సునీల్‌కుమార్‌ను ప్రభుత్వం తొలుత 2025 మార్చి 2న సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచీ ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అగ్రిగోల్డ్‌ నిధుల దుర్వినియోగంతో పాటు అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసుల్లో సునీల్‌ కుమార్‌పై విచారణ కొనసాగుతోంది. వీటితో పాటు ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై సోషల్‌ మీడియా వేదికగా ఆయన వ్యాఖ్యలు చేసిన అంశంపై విచారణాధికారి తన నివేదికను సమర్పించాల్సి ఉంది.

Updated Date - Feb 23 , 2026 | 05:48 AM