Share News

స్థానిక ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా పనిచేద్దాం: నాదెండ్ల

ABN , Publish Date - Aug 28 , 2026 | 09:06 PM

సార్వత్రిక ఎన్నికలలో మనమంతా కలిసి పని చేసి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించామని.. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా పనిచేద్దాం: నాదెండ్ల
AP Minister Nadendla Manohar

అమరావతి, ఆగస్టు 28: సార్వత్రిక ఎన్నికలలో మనమంతా కలిసి పని చేసి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించామని.. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజధాని అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఎన్నికల్లో వైసీపీ దాడులు, బెదిరింపులు తట్టుకుని పోటీ చేశారని గుర్తు చేశారు. అందుకే వారిని గౌరవిస్తూ ఈ రోజు సన్మానించుకున్నామని పేర్కొన్నారు. ఎన్డీయేలో మనం భాగస్వాములం అని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ‌ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి ఆయన దిశానిర్దేశం చేశారు.


గ్రామ స్వరాజ్యం‌ కోసం‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారని వివరించారు. కష్టపడి పని చేసే వారికి‌ పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని అన్నారు. జనసేనకు నేడు ఇంత ప్రజాదరణ ఉందంటే ప్రతి జనసైనికుడి కష్టంతోపాటు పోరాట స్ఫూర్తి కూడా కారణమని పేర్కొన్నారు. జిల్లాల వారీగా పట్టు ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నామన్నారు. అన్ని ‌విధాలా అధ్యయనం చేసి జనసేనకు బలం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తామని చెప్పారు.


యువత, మహిళలకే మన పార్టీ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహన ఉండాలని వారికి సూచించారు. పార్టీ కోసం‌ ధైర్యంగా‌ నిలబడిన వారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. 2021లో సామాన్య ప్రజలే అభ్యర్థులుగా నిలబడ్డారని అన్నారు. పార్టీని‌ కించపరిచే వాళ్లకు ఈ ఎన్నికలలో మనమేంటో‌ చూపాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. నిలబడిన ప్రతి‌చోటా విజయమే లక్ష్యంగా పని‌ చేయాలని వారికి సూచించారు. కూటమి విజయం కోసం ప్రధాన ఎన్నికలలో చాలా మంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అటువంటి వారికి ఇప్పుడు సీట్లు‌ ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాజకీయాలలో చిన్న విషయాలపై కూడా అతిగా స్పందిస్తారని తెలిపారు.


సోషల్ మీడియాను ఉపయోగించుకుని జనసేన పార్టీ బలోపేతం కోసం జెన్ జీ పని చేయాల్సి ఉందన్నారు. ఎవరో ఏదో వాగారని మనం వాటి‌పై స్పందించకుండా ఉండాలని సూచించారు. మనకు మీడియా లేదు.. సోషల్ మీడియానే మన బలమని పునరుద్ఘాటించారు. మనకు తక్కువ సమయం ఉంది, ఇప్పటి నుంచే అందరూ క్షేత్ర స్థాయిలో కష్టపడాలని స్పష్టం చేశారు. సెప్టెంబరు రెండో తేదీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజని.. ఈ సందర్భంగా సరికొత్త ప్రణాళికలు సిద్దం చేశారని చెప్పారు. యువతను ఈ ఎన్నికలలో భాగస్వామ్యం చేసేలా 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తామన్నారు. జనసేన పార్టీ యువజన సేన ఆవిర్భావ సభకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు చేశారు: నాదెండ్ల

వైఎస్ జగన్‌పై మంత్రి మనోహర్ విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మనపై ఎన్నో దాడులు చేశారని అన్నారు. అన్నీ తట్టుకుని మన వీర మహిళలు నిలబడ్డారని తెలిపారు. ఆనాడు ఏకగ్రీవం పేరుతో పోటీ చేసిన వారిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. నామినేషన్లు వేయకుండా చాలా చోట్ల బెదిరించారని చెప్పారు.

ఇప్పుడు అదే వైఎస్ జగన్ ఏకగ్రీవం అయితే సీట్లు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారని మంత్రి నాదెండ్ల విమర్శించారు. సిద్దం సభల పేరుతో పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి ఎలా‌ అవమానించారో మనమంతా చూశామన్నారు. ప్రజలు అందుకే వారికి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. కష్టపడి పని ‌చేసిన జనసేన పార్టీకి వంద శాతం స్ట్రైక్ రేటను ప్రజలు ఇచ్చారని మంత్రి మనోహర్ గుర్తు చేశారు,

Updated Date - Aug 28 , 2026 | 09:19 PM