మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మహ్మద్ నసీర్
ABN , Publish Date - May 06 , 2026 | 05:31 PM
రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మహ్మద్ నసీర్ స్పష్టం చేశారు.
అమరావతి, మే 06: రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మహ్మద్ నసీర్ స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో మైనార్టీస్ సంక్షేమ కమిటీ చైర్మన్ మహ్మద్ నసీర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మహ్మద్ నసీర్ మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మైనారిటీలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. పీఎంజేవీవై కింద రూ.275 కోట్ల నిధుల విడుదల చేసినట్లు చెప్పారు. మైనారిటీల అభివృద్ధికి రూ.1000 కోట్ల డీపీఆర్‌లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. గుంటూరు, నంద్యాలలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఇమామ్, మౌజన్ల బకాయి గౌరవ వేతనాల విడుదల చేసినట్లు ఆయన వివరించారు. అర్హులైన వారికి కొత్తగా గౌరవ వేతనాల ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రార్థనాలయాలకు పొజిషన్ సర్టిఫికెట్స్‌పైనా చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లిం మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మైనారిటీలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.20 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని చైర్మన్ మహ్మద్ నసీర్ తెలిపారు. మైనారిటీ హాస్టళ్లలో ఖాళీల భర్తీపై చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలపై త్వరలో సమీక్ష నిర్వహస్తామని చెప్పారు. వ్యవసాయం, విద్య, ఉపాధి రుణాలకు ప్రాధాన్యం ఇవ్వలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. బీసీ-ఈ దూదేకుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీలో ఉర్దూ టీచర్ల నియామకంపైనా చర్చించామని చెప్పారు. అన్ని రంగాల్లో మైనారిటీలకు సమాన భాగస్వామ్యం కల్పించడమే తమ కమిటీ లక్ష్యమని ఆయన వివరించారు. మైనారిటీల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ నసీర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మహ్మద్ నసీర్
కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ
For More AP News And Telugu News