వైఎస్ జగన్ రెడ్డి రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు..
ABN , Publish Date - Apr 27 , 2026 | 03:56 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్.. గొప్ప క్రెడిట్ సాధించారని మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్.. గొప్ప క్రెడిట్ సాధించారని అన్నారు. జగన్ క్రెడిట్లను ఏపీ ప్రజలు తట్టుకోలేక అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా జగన్ మాత్రం విష ప్రచారాలు ఆపట్లేదని మంత్రి వాసంశెట్టి ఆగ్రహించారు.
మునుపెన్నడూ చూడని వింత ప్రవర్తనతో జగన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని మంత్రి వాసంశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక జగన్ బాధపడుతున్నారని చెప్పారు. క్రెడిట్ చోరీలో జగన్ సిద్ధహస్తుడంటూ విమర్శలు గుప్పించారు మంత్రి. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన క్రెడిట్ జగన్‌కు మాత్రమే సొంతమన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేయడంతో పాటు అన్ని రంగాలను నాశనం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు మొదలు.. చిన్న కంపెనీల వరకూ యాజమాన్యాన్ని వేధించారని మంత్రి ఆరోపించారు.
దాదాపు 40కి పైగా కంపెనీలను ఏపీ వదిలి పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్‌దే అని మంత్రి వాసంశెట్టి ఆరోపించారు. హత్యా రాజకీయాలు, కల్తీ మద్యం, ఇసుక అక్రమ దందా ఇలా జగన్, ఆయన అనుచరుల క్రెడిట్‌ను ఎవరూ కాపీ చేయలేరని అన్నారు. జగన్ తన మానసిక బాధ తగ్గించుకునేందుకు యోగా లాంటి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి వాసంశెట్టి వ్యంగ్యంగా అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ
విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేశ్..