Share News

గూగుల్ డేటా సెంటర్‌ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ

ABN , Publish Date - Apr 27 , 2026 | 03:16 PM

ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 2014లోనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.

గూగుల్ డేటా సెంటర్‌ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ
TDP MLC Panchumarthi Anuradha

విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 2014లోనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. విశాఖను ఐటీ, ఏఐ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలని అప్పుడే సంకల్పించారని అనురాధ పేర్కొన్నారు.


2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని దెబ్బతీసిందని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. వైసీపీ పాలనలో విశాఖను గంజాయి హబ్‌గా మార్చారని, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు, కిడ్నాప్‌లు, లిక్కర్ మాఫియాలు పెరిగాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి వాటాల కోసం వైసీపీ ఎంపీలు తమ కుటుంబసభ్యులనే ఒకరినొకరు కిడ్నాప్‌లు చేసుకున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తున్నారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పుకొచ్చారు.


సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కఠోర శ్రమ ఫలితంగానే రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. విశాఖలో ఈ డేటా సెంటర్ శంకుస్థాపన దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.80 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్సీ వివరించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారని, చనిపోయిన రైతుల పేర్లతో పిటిషన్లు దాఖలు చేశారని ఆగ్రహించారు. కంపెనీలకు రాయితీలు ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లడం ద్వారా పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. గూగుల్ డేటా సెంటర్‌ను గోడౌన్‌తో పోల్చడం వైసీపీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.


ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖకు జగన్ రెడ్డి ఒక్క పెద్ద పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఎమ్మెల్సీ అనురాధ మండిపడ్డారు. జగన్ తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి లోకేశ్ శ్రమిస్తున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి

విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేశ్.

ఈవీ వాహనాల వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Apr 27 , 2026 | 03:19 PM