విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు.. విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:57 PM
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యూనిట్ ధరను రూ.4.60కు తగ్గించేలా కసరత్తు చేస్తోంది. సోమవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది.
అమరావతి, ఏప్రిల్ 27: విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యూనిట్ ధరను రూ.4.60కు తగ్గించేలా కసరత్తు చేస్తోంది. సోమవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈవీ వాహనాల వినియోగంపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల అమలులో లక్ష్యాలు చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విద్యుత్ వినియోగదారులకు, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే కుదుర్చుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లోపు కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని వారికి ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలతోపాటు ప్రజల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. అందుకోసం విద్యుత్ పొదుపు ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యుత్ రంగం అస్తవ్యస్తమైందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యంగా పీపీఏల రద్దు నిర్ణయంతో ప్రజలపై రూ. 9,000 కోట్ల భారం పడిందని విమర్శించారు. విద్యుత్ వినియోగించకుండానే ఆ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించడం వైసీపీ ప్రభుత్వం చేసిన గొప్ప తప్పిదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సరిదిద్దుతూ ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా సమర్థవంతంగా విద్యుత్ వ్యవస్థను నడిపిస్తున్నామన్నారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి
For More AP News And Telugu News