పడవ బోల్తా ఘటనపై విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
ABN , Publish Date - Jun 14 , 2026 | 08:19 PM
పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.
సింగపూర్, జూన్14: పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. తక్షణం మృతుల కుటుంబాలకు ఈ నగదు మొత్తాన్ని చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
అలాగే ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి స్థాయి నివేదిక సమర్పించడంతో పాటు తదుపరి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ ఘటనపై తదుపరి చర్యల కోసం విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్, జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నదిలో పడవ బోల్తా పడి.. నలుగురు మృతి చెందారని సీఎంకు జిల్లా కలెక్టర్ వివరించారు. నదిలో ఇసుక దిబ్బను బోటు ఢీకొట్టిందని.. దాంతో పడవ బోల్తా పడిందని సీఎంకు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదంలో గంధం శ్రీను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యలు మృతి చెందారన్నారు. ఇదే బోటులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.
పోస్ట్‌మార్టం కోసం నది నుంచి వెలికి తీసిన మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం సింగపూర్‌కు బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. జూన్ 16వ తేదీ రాత్రికి ఆయన సింగపూర్ నుంచి భారత్‌కు బయలుదేరనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం
కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు
For More AP News And Telugu News