కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:42 PM
శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.
శ్రీశైలం, జూన్14: శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు. అప్పగించని 7 కాటేజీలకు నోటీసులు అప్పగించామన్నారు. ఏళ్ల తరబడి.. దాతలే ఆ కాటేజీలను తమ స్వంతానికి వాడుకుంటున్నారని తెలిపారు. దేవాలయం కోసం కట్టించిన కాటేజీలు.. ఇలా సొంతానికి వాడుకోవడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.
దర్శి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కట్టించిన కాటేజీ దేవాలయానికి అప్పగించ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సదరు కాటేజీలు ఇవ్వకపోయినా.. విద్యుత్ బిల్లులు మాత్రం దేవస్థానం చెల్లిస్తుందన్నారు. ఆయా కాటేజీలను స్వేచ్చందంగా దేవస్థానానికి అప్పగించాలని కట్టించిన దాతలకు వివరించారు. ఈ కాటేజీల దుర్వినియోగం చేసిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు వెల్లడించారు.
శైలం దేవస్థానానికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి టోకరా వేసినట్లు్ ప్రచారం జరుగుతుంది. బూచేపల్లి కుటుంబీకులు శ్రీశైలంలో ప్లాట్ నం.34లో కాటేజీ కోసం స్థలం తీసుకుని నిర్మించారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కాటేజీని దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. 2023 మేలోనే దీనిని అప్పగించాల్సి ఉన్నా, ఇప్పటికీ వారే వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీంతో 15 రోజులలోపు ఆ కాటేజీని అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా కాటేజీ అప్పగించకుంటే.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం కాటేజీలను నిర్మించిన దాతలకు ఏడాదిలో 30 రోజులు ఉచితంగా, మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే సగం ధరకు ఇస్తారు.