మద్యం కుంభకోణం కేసులో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి హైకోర్టు షాక్
ABN , Publish Date - May 07 , 2026 | 08:31 PM
జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఏ9 నిందితుడుగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు, ఆయనను ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
అమరావతి: జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఏ9 నిందితుడుగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మద్యం రవాణా కేసు దర్యాప్తుకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం వాదనలు వినిపించారు. వ్యాపార అవసరాల నిమిత్తం ఆయన విదేశాల్లో ఉన్నారని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోర్టును అభ్యర్థించారు.
అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, కేసు నమోదు అయిన తర్వాతే నిందితుడు విదేశాలకు వెళ్లినట్లు, ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని సమాచారం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఈ కేసులో ఇతర నిందితులకు కూడా విదేశాల్లో ఆశ్రయం లభిస్తున్నట్లు ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో అతడిని 'ప్రకటిత నేరస్థుడు'గా ప్రకటించాలన్న పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest AP News