ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలం: హోం మంత్రి
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:16 PM
జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు.
అమరావతి, ఫిబ్రవరి 23: జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
ఖైదీల్లో పరివర్తన తీసుకురావటం కోసం చట్టంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ఖైదీలు మారేందుకు, మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు.. వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు.
ఇక ఈ బిల్లుపై చర్చలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ చట్టంలో ప్రస్తావన లేదన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య పెరిగినా సౌకర్యాలు మాత్రం పెరగటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైళ్ల శాఖలో 30 శాతం సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయని వివరించారు. జైళ్లలో మహిళా సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. అండర్ ట్రయల్ ఖైదీలు న్యాయ సహాయం లేకపోవడంతో జైళ్లలోనే ఉండిపోతున్నారని గుర్తు చేశారు.
చిన్న చిన్న కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి సత్ ప్రవర్తన ఆధారంగా బయటకు పంపించాలన్నారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చాక జనజీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో తాము సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. జీవిత ఖైదు పడిన ఖైదులు 60 ఏళ్లు వయసు దాటిన వారికి క్షమాబిక్ష ప్రసాదించాలంటూ ప్రభుత్వానికి సూచించారు. క్షమాబిక్ష కోసం జైళ్లలోని చాలామంది ఖైదీలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆ తర్వాత జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్
For More AP News And Telugu News