అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:46 AM
రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.
తూర్పుగోదావరి, ఫిబ్రవరి 23: రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాల వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్‌ను కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలకు పంపామన్నారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న అనూరియా(మూత్రం నిలిచిపోవడం)పై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరినగర్ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 15 నుంచి పలువురు వాంతులవడం, మూత్ర విసర్జన కాకపోవడం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రకమైన కారణాలతో 14 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో బి.కనకరత్నం(76), తాడి కృష్ణవేడి(75) ఇప్పటికే మృతిచెందారు. వ్యాధికి గురైన వారిలో 60 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉన్నారు. 5 నెలల శిశువుతో పాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అనూరియా వ్యాధి బారినపడిన వారందరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేస్తున్నట్లు వైద్యధికారులకు బాధితులు వెల్లడించారు. దీంతో పాల కల్తీ జరిగి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. శివరాత్రి అంటే.. ఫిబ్రవరి 15న పాలు,పెరుగు చేదుగా అనిపించాయని బాధితులు వివరించారు. దీంతో పాల సదరు వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాధితుల రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌కు పంపారు. ఆ నమూనాలకు నివేదికలు అందాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇందులో కొత్త కేసులేవి నమోదు కాలేదని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
జిల్లా ఎస్పీ రియాక్షన్..
అనూరియా వ్యాధిపై విజయవాడ నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్స్‌తో విచారణ చేపట్టామని జిల్లా ఎస్పీ నర్సింహ కిశోర్ వెల్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
కాల్ సెంటర్ ఏర్పాటు..
అనూరియ కేసులపై సమాచారం కోసం ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే 9494060060 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరు: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News