Share News

గొల్లగుప్ప బాలిక మృతి కేసులో అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Nov 11 , 2026 | 09:25 PM

పోలవరం జిల్లాలోని గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని జమున మృతి చెందిన ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనపడడం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.

గొల్లగుప్ప బాలిక మృతి కేసులో అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, నవంబర్11: పోలవరం జిల్లాలోని గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని జమున మృతి చెందిన ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనపడడం లేదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ ఎస్ఐ దాఖలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. ఇది కోర్టు పట్ల అవిధేయత ప్రదర్శించడమేనని సీరియస్ అయింది. ఈ కేసును ఎంత సీరియస్‌గా తీసుకున్నారో దీనిని బట్టే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలను నివేదికలో స్పష్టం చేయలేదని మండిపడ్డింది.


మెడికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారో లేదో వివరాలు కూడా లేవని పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదికను కూడా జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం జిల్లా డీఎం అండ్ హెచ్ఓ, జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను పది రోజులకు హైకోర్టు వాయిదా వేసింది.


ఏడేళ్ల విద్యార్థిని మృతి.. స్పందించిన న్యాయవాది

పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటనపై తెలంగాణకు చెందిన న్యాయవాది మణిదీప్.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. బుధవారం ఈ కేసును హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్టేటస్ రిపోర్ట్‌ను ఎస్ఐ దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వ అధికారులు తీరుపై హైకోర్టు పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

For More AP News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 09:38 PM