Share News

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:07 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గోదావరి పుష్కరాలు, దక్షిణాది నదుల అనుసంధానం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
CM Chandrababu Met PM Modi

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గోదావరి పుష్కరాలు, దక్షిణాది నదుల అనుసంధానం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించారంటూ, ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని, క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని ప్రశంసించారు.

దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, దృఢమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని ప్రధానిని కీర్తించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారత దేశ గమనాన్ని మార్చారని ప్రధానితో చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా తోడ్పడ్డారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజల తరఫున ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.


నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందుతుందని ప్రధానికి తెలిపారు.

దేశవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్, పవర్ గ్రిడ్ వంటివి ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని.. ఇప్పుడు నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తే వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ఏపీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని సీఎం కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి సైతం గోదావరి పుష్కరాలకు భక్తులు తరలివస్తారని ముఖ్యమంత్రి వివరించారు.


రాష్ట్రంపై ఎల్‌ నినో ప్రభావం

ఏపీలో ఎల్‌ నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి సీఎం చంద్రబాబు వివరించారు. కరవు నష్టాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను కూడా మోదీకి తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వినతి

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలపైనా మోదీతో చర్చించారు. విశాఖ మెట్రోను మంజూరు చేయాలని, అలాగే బీచ్ రోడ్డు నిర్మాణం గురించి వివరించారు. 2047 నాటికి రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ గురించి ప్రధానికి సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్..

ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు.. ల్యాండ్ లార్డ్ మోడల్‌పై ఆసక్తి

Updated Date - Oct 08 , 2026 | 07:17 PM