Share News

అమరజీవి విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నామకరణం: సీఎం

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:41 PM

అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరివాడని భావించి.. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహావిష్కరణ కోసం కృషి చేశారన్నారు.

అమరజీవి విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నామకరణం: సీఎం
CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 16: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరివాడని భావించి.. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహావిష్కరణ కోసం కృషి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందన్నారు. రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నామకరణం చేశామని చెప్పారు. అహింసా మార్గంలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం ఈ తరం వాళ్లు తెలుసుకోవాలన్నారు. స్ఫూర్తికి మారు పేరు ఆర్యవైశ్య సంఘమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో పొట్టి శ్రీరాములు పనిచేశారని తెలిపారు. అలాగే అనేక సామాజిక ఉద్యమాల్లో ఆయన భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు.


ఇక రాజధాని అమరావతి నిర్మాణంలో ఎంతోమంది రైతుల త్యాగం ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు.. 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్‌ పూలింగ్‌కు సహకరించారని వివరించారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ.. మూడు ముక్కలాట ఆడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని గత పాలకులు స్మశానం అని అవహేళన చేశారని తెలిపారు.


పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. 6 నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేశారని వివరించారు. రెండో దశ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్‌ వినియోగించారని సీఎం చంద్రబాబు చెప్పారు.


గత ప్రభుత్వం పాలనతో బ్రాండ్ దెబ్బతిన్నదని.. తెలుగు జాతి ఇబ్బంది పడిందని గుర్తించి తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరం కలసి నిలబడి.. బీజేపీతో కలిసి కూటమిగా జత కట్టామని వివరించారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అమరావతిని మూడు ఏళ్లలో ఒక స్థాయికి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఖర్చు ప్రభుత్వం డబ్బు కాదని.. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ అని ఏపీ సీఎం వివరించారు.


అమరావతి వల్ల సంక్షేమం సక్రమంగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొన్నటి వరకూ ఆర్య వైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలన్నా భయపడుతూ చేసుకోవాల్సిన పరిస్ధితి ఉండేదన్నారు. రూ. 10 సంపాదిస్తే అందులో రూ.2 దానం చేసేది ఆర్య వైశ్య కులమని తెలిపారు. ఆర్య వైశ్యులను అనేక విధాలుగా పిలుస్తారని.. అందరిని అదే పేరుతో పిలచేలా త్వరలోనే జీవో జారీ చేస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములకు నిజమైన నివాళి ఇవ్వడమంటే.. ఏపీని నెంబర్ వన్‌గా నిలపడమేనని సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా పేర్కొన్నారు.


తెలుగు జాతి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి

తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. మద్రాస్‌ ప్రెసిడెన్సిలో తెలుగు ప్రజల ఇబ్బందులను ఆయన గుర్తించి.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్

ఒడిశాలోని కటక్‌ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి

For More AP News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 02:22 PM