పారదర్శకంగా ఉంటున్నాం.. ప్రజలకు వాస్తవాలు తెలియచేద్దాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 19 , 2026 | 07:41 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, అయినా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి వారి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, అయినా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి వారి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.
కొందరు ప్రభుత్వం, కూటమి పార్టీలపై అబద్ధాలాడుతూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అలాంటి తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాలు, వ్యక్తుల ద్వారా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిందేనని పార్టీ నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే వాళ్లే విశ్లేషించుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పరిపాలన విషయంలో ఏపీ ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారన్నారు.
మొన్నటి ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కూటమి పార్టీలను ఎంతగా అణగదొక్కే ప్రయత్నం చేసినా.. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి అద్భుతమైన విజయాన్ని అందించారని గుర్తు చేశారు. ప్రజలకు నిజాలను తెలియచేయడమనేది ప్రధాన బాధ్యతనే విషయాన్ని గుర్తించాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, టీడీపీ నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్లాసులతోపాటు, కాఫీ కబుర్లు వంటి కార్యక్రమాల ద్వారా లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. శిక్షణకు వచ్చే కార్యకర్తలకు పార్టీ ధోరణి, సిద్ధాంతాలను వివరించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకునే వీలు కలుగుతోందని చెప్పారు.
విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాల్లో పార్టీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న వ్యవస్థను సమగ్రంగా తీర్చిదిద్దాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈనెల 29వ తేదీన టీడీపీ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నేతలు తెలిపారు. మహానాడు నిర్వహణకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి