దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేందుకు యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:30 PM
జలధార- జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
అమరావతి: జలధార- జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మండలస్థాయి నోడల్ అధికారి నుంచి రాష్ట్రస్థాయి నోడల్ అధికారి వరకూ సవాల్‌గా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. జలధార- జలహారతి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పనులను ఆయనకు అధికారులు వివరించగా.. పలు కీలక విషయాలపై వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..'జలధారకు సంబంధించి ప్రతీ మండల నోడల్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించాలి. అర్బన్ మండలాల్లోనూ నోడల్ అధికారులు పటిష్ఠంగా పర్యవేక్షించాలి. నీటి సంరక్షణ- నీటి భద్రత విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాలి. జలధార కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలి. భారీ వర్షాలు పడినా నీటి ముంపు లేకుండా ఉండేలా కాల్వలు, చెరువుల మరమ్మతులు చేపట్టాలి. వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైనేజీలను బాగు చేసే అంశంపైనా ఫోకస్ పెట్టాలి.
భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ భారం తగ్గుతుంది.. విద్యుత్ భారం తగ్గితే వేరే కార్యక్రమాలకు ఆ నిధులను వినియోగించుకోవచ్చు. ఏపీలో వివిధ దేవాలయాల్లో ఉన్న పుష్కరిణులకు నీటి లభ్యత కల్పించేలా జలధార కార్యక్రమం చేపట్టాలి. దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. జలధార- జలహారతిలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి. జలధార పనుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో విశ్లేషించాలి' అని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
చంద్రబాబు జన్మదినం.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేసిన భువనేశ్వరి
ఆ సమయంలో నేను ఉండటం గొప్ప భావోద్వేగ సందర్భం: నారా లోకేశ్