బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై భారత్ సత్తా చాటింది: సీఎం చంద్రబాబు నాయుడు..
ABN , Publish Date - Sep 14 , 2026 | 11:58 AM
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-18పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-18పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సు ద్వారా ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఒకే వేదికపైకి వచ్చాయని సీఎం పేర్కొన్నారు. ప్రపంచం కీలక మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు.
బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడంపైనా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. బహుళపక్ష సంస్థలను మరింత బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్వాగతించారు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే కీలక అంశాలుగా వీటిని అభివర్ణించారు. విభిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలు ఒకే వేదికపైకి వచ్చి నిర్మాణాత్మకంగా చర్చించుకునేందుకు, ఏకాభిప్రాయానికి చేరుకునేందుకు భారత్ విశ్వసనీయ వేదికగా ఎదిగిందని చంద్రబాబు కొనియాడారు.
అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి, ప్రాధాన్యానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్నీ ఆయన ప్రశంసించారు. 'ఈ కీలకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీకి నా అభినందనలు' అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ గొంతు గతంలో ఎన్నడూ లేనంతగా విశ్వాసం, గౌరవంతో వినిపిస్తోందన్నారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయంగా భారత్ స్థాయి మరింత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్ద చిరుత కలకలం..
కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం