రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:53 PM
రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
అమరావతి: రాష్ట్రంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రుణాల లక్ష్యాలను చేరుకున్నప్పుడే ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల నిర్వహణకు సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు గతంతో పోలిస్తే ఈసారి రుణాల మొత్తం పెరిగినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు జరగలేదని చంద్రబాబు అన్నారు. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరులో చాలా వెనుకబడి ఉన్నాయని పేర్కొంటూ.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎల్‌నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కౌలు రైతులకు కూడా సమృద్ధిగా రుణాలు అందేలా బ్యాంకులు ముందుకు రావాలని సీఎం సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల తిరిగి చెల్లింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారని తెలిపారు. రుణాలు తీసుకున్న మహిళల్లో 99 శాతానికి పైగా సమయానికి చెల్లింపులు చేస్తున్నారని, కేవలం 0.67 శాతం మంది మాత్రమే చెల్లింపుల్లో విఫలమవుతున్నారని చెప్పారు. రుణాల చెల్లింపుల్లో విఫలమైన వారి నుంచి బకాయిల రికవరీపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) విధానాన్ని పరిశీలించాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read:
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు
కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్