ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే లక్ష్యం: చంద్రబాబు
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:11 PM
పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా పార్టీ కేడర్‌కు సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీ రోజురోజుకూ మరింత సమర్థవంతంగా పని చేసేలా బలోపేతం కావాలని పేర్కొన్నారు. అందుకే పార్టీలో యువతకు కీలక బాధ్యతలు అప్పగించామని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మంది కొత్త వారికి, విద్యావంతులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని గుర్తు చేశారు. దేశంలోనే యువ పార్లమెంట్ కలిగిన పార్టీగా టీడీపీ నిలిచిందని వ్యాఖ్యానించారు.
సమర్థులకే పెద్దపీట..
సమర్థులకే పెద్దపీట వేసినట్టు వెల్లడించిన సీఎం, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు అధ్యక్షులు, సెక్రటరీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో నివేదికలు తెప్పిస్తామని స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో పార్లమెంట్ కమిటీల పాత్ర కీలకమని చంద్రబాబు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్లమెంట్ అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో పదవులు ఇచ్చేటప్పుడు కార్యకర్తల అభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
పది శాతం అదనంగా సాధించాలి..
జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే కనీసం పది శాతం అదనంగా సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి మరింత బలపడిందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, నిర్లక్ష్యం వహించిన వారిని పక్కనపెడతామని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలని, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం నాయకత్వం, శ్రేణుల బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యకర్తే పార్టీకి అధినేత
కార్యకర్తే పార్టీకి అధినేత అని స్పష్టం చేసిన చంద్రబాబు.. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడే పార్టీ శాశ్వతంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పసుపు జెండా కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలని, కార్యకర్తల ద్వారానే పనులు జరగాలన్నారు. సీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, అనంతపురం జిల్లా ఆదర్శంగా ఉందని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని తెలిపారు. డబ్బులతో మాత్రమే రాజకీయాలు నడవవని, ప్రజల నమ్మకమే అసలైన బలం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పాత్ హోల్ ఫ్రీ రోడ్లు
డీఎస్సీని సమయానికి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, 6 వేల పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12 వేల వరకు పెంచినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఇప్పుడు పాత్ హోల్ ఫ్రీ రోడ్ల దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పదవులు పొందిన వారి పనితీరును మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, సరిగా పనిచేయకపోతే అవకాశం వేరొకరికి ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లో కూడా మార్పులు రావాలని సూచించారు. రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో గెలిచేలా సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News