Share News

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:12 PM

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

చెన్నై, ఆగస్టు 20: వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని తెలిపారు.


కేంద్ర - రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని ఏపీ సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఆయన ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతి - బెంగళూరు - చెన్నై నగరాలను అనుసంధానించేలా ఈ రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు.


అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలనీ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని తెలిపారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేలా మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటును ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.


దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందని ఆయన గుర్తు చేశారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలు.. 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.


రాజధాని అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని ఈ సందర్భంగా ఏపీ సీఎం గుర్తు చేశారు. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేశారు.


అలాగే కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కూడా కేంద్ర అనుమతులు మంజూరు చేయాలన్నారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకుపైగా నీటిని మళ్లించే ప్రతిపాదన ఉందన్నారు. గోదావరి - కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గంగా - కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక ఆవశ్యకతను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.


సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి గురించి ఎంతో విజన్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారంటూ సీఎం చంద్రబాబును కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ మార్పు..

అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 04:07 PM