గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 27 , 2026 | 09:26 PM
హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని అన్నారు..
అమరావతి, మే27: హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహానాడులో ఇంత మంది కార్యకర్తలు పాల్గొనటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. మహానాడు సమావేశం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తొలిరోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి.. వారిలో ఆందోళన వ్యక్తం అవుతోందని వైసీపీ నేతలను పరోక్షంగా విమర్శించారు.
కార్యకర్తలుగా ఉన్న వారు నాయకులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని మహానాడు ప్రసంగాల ద్వారా అర్ధమైందన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్ధమంతంగా ఎదుర్కోనేలా కార్యకర్తలు, నేతలూ సిద్ధం కావాలని సూచించారు. రేపటి మహానాడులో ముఖ్యమైన చర్చలు, తీర్మానాలు జరుగుతాయని వివరించారు. వాటన్నింటిలో పార్టీ కుటుంబ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని సూచించారు.
మహానాడు వర్చువల్‌గా నిర్వహణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తొలిరోజు వర్చువల్ మహానాడుకు 7.5 లక్షల మంది హాజరుకావటం రికార్డు అని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలను ఈ టెలికాన్ఫరెన్సులో ప్రస్తావించారు. లోకేష్ చేసిన ఈప్రతిపాదనను ఆమోదించాలని టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబును నేతలు కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇన్‌చార్జ్‌లు తదితరలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News