Share News

ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.. జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

ABN , Publish Date - Mar 12 , 2026 | 09:46 PM

ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని వారికి ఆయన సూచించారు.

ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.. జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

అమరావతి, మార్చి 12: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని వారికి ఆయన సూచించారు. గురువారం రాజధాని అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో.. శాంతిభద్రతల అంశంపై జిల్లా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రతీ ప్రాణమూ విలువైనదే.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం లాంటి కొన్ని జిల్లాల్లో చేపడుతున్న ఉత్తమ విధానాలు ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించాలని చెప్పారు.


డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలని.. ఎవరైనా సరే ఉపేక్షించ వద్దన్నారు. బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్లు కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తామన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ మరింత మెరుగు పడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లాంటి అంశాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లోని బ్లాక్ స్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.


బ్లాక్ స్పాట్స్‌పై ఫోకస్ పెట్టండి.. ప్రమాదాల నివారణలో రిజల్ట్ కనిపించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ప్రతీ బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు భయం ఉండేలా కఠినంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్సు.. అప్పుడే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలపై గృహ హింస కేసుల్లోనూ తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఈ సమావేశం వేదికగా దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉగాది ముందే రైతుల ఖాతాల్లో నగదు

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

For More AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 09:51 PM