Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 07 , 2026 | 03:27 PM

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: సీఎం చంద్రబాబు
Chandrababu On AP local body elections 2026

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. కూటమిగా సఖ్యతగా ఉండాలని, పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదని సూచించారు. మహిళా రిజర్వేషన్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సమర్థవంతమైన మహిళా నేతలను ముందుగానే గుర్తించాలని చెప్పారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలను పరిష్కరించామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని, ఆ సానుకూలత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిఫలించాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడంపైనే తన ధ్యాస, ఆలోచన అంతా ఉందని స్పష్టం చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పరిపాలనతో పాటు పార్టీకి కూడా ప్రతిరోజూ సమయం కేటాయిస్తున్నానని తెలిపారు.

ఎమ్మెల్యేలకు టార్గెట్లు

ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. టార్గెట్లు పెట్టుకుని పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో స్పష్టమైన లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఆ అంశాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు.

ప్రతి మూడు నెలలకు సమావేశం

ఇలాంటి లీడర్‌షిప్ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు అమలు చేసే బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తదుపరి సమావేశంలో ప్రదర్శించాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.


Also Read:

పార్టీ ఇచ్చిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ

కొత్త రాజకీయ పార్టీ అజెండాపై విజయ సాయిరెడ్డి ఏమన్నారంటే..

Updated Date - Sep 07 , 2026 | 03:32 PM