Share News

ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:22 PM

ఆక్వా ఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను సీఎం చంద్రబాబు నాయుడు కోరడంతో వారు సానుకూలంగా స్పందించారు. దీంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు.

ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్18: ఆక్వా ఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను సీఎం చంద్రబాబు నాయుడు కోరడంతో వారు సానుకూలంగా స్పందించారు. దీంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. దీంతో కేజీ ప్రస్తుతం రూ.112 నుంచి రూ.108కి ఫీడ్ ధరలు తగ్గనున్నాయి. ఆక్వా, టొబాకో, మామిడి రైతుల సమస్యలపై గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతోపాటు ఫీడ్ తయారీదారులతో ఆయన సమావేశమయ్యారు.


ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులతో కమిటీ వేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. 20 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతులతోపాటు ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు.


సీఎంకే ఆక్వా రైతులు ధన్యవాదాలు..

ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్‌ రూ.1.50కే ఇవ్వడంపై ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతోందని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెంచారని గుర్తు చేశారు. అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి ఆక్వా రైతులు తీసుకెళ్లారు. తాము ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించ లేదని.. ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయం చేశారని సీఎంకు ఆక్వా రైతులు వివరించారు.


2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.107.80కి చేరిందని సీఎం చంద్రబాబుకు రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర రూ.5.80 తగ్గించిందని రైతులు గుర్తు చేశారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని మరింత లాభాలు పొందేలా చర్యలు చేపట్టాలని రైతులకు సీఎం సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా రైతులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి రాష్ట్రం ఐదేళ్లు నాశనమైంది: మంత్రి గొట్టిపాటి

వ్యక్తిగత సమస్యలు పార్టీపై రుద్ద వద్దు: నేతలకు మల్లు రవి సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 06:34 PM