Bhogapuram Airport: ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కనున్న ఉత్తరాంధ్ర: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:06 PM
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ఆదివారం ల్యాండ్ అయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అమరావతి, జనవరి 04: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ల్యాండింగ్ కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్వారాలు తెరుచుకున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ రోజు (ఆదివారం) ఒక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ నాయకత్వంతోపాటు ఆయన దార్శనికతకు మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందని గుర్తు చేశారు. 2026 జూన్ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. దాంతో ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో కొంత పుంతలు తొక్కుతుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం స్పందించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ పదాలను హ్యాష్ ట్యాగ్‌తో మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మితమవుతోంది. ఆదివారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఈ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతోపాటు విమానయాన సంస్థ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ఎయిర్ పోర్ట్ పూర్తయిందని జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు విమానం ల్యాండ్ కావడంపై సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు సైతం సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
Read Latest AP News And Telugu News