భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:47 PM
భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చినట్లు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి, జులై 27: భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చినట్లు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ఏపీ సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం అవుతుందని తెలిపారు. 2,703 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,727 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు. ఈ విమానాశ్రయంలో 3,800 మీటర్ల రన్‌వే ఉందని గుర్తు చేశారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం ఈ విమానాశ్రయం కలిగి ఉందన్నారు. 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే భద్రత, ట్రాఫిక్, అతిథుల స్వాగత ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. ప్రతి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News