Share News

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 10:16 AM

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, మార్చి 20: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది.


ఇక శనివారం ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.


అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగులు కింద నిల్చో వద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.


మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. మొత్తం 6 జిల్లాల్లోని 16 మండలాలపై ఈ వానలు అత్యధిక ప్రభావం చూపాయి. ఇప్పటికే ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధర..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

For More AP News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 12:30 PM