విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు: కాల్వ శ్రీనివాసులు
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:29 PM
తల్లికి వందనంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో తల్లుల ఖాతాల్లో ఈ రోజు(బుధవారం) నుంచి తల్లికి వందనం నిధులు జమవుతున్నాయని చెప్పారు.
అమరావతి, జులై 22: 'తల్లికి వందనం'తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో తల్లుల ఖాతాల్లో ఈ రోజు తల్లికి వందనం నిధులు జమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల ఆర్థిక సాయం చేశామని ఆయన వివరించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా 42,70,842 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేశామని చెప్పారు.
ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తామన్న హామీని చేసి చూపించామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి.. గతంలో తల్లులను మోసం చేశారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ఒక్క బిడ్డకే పరిమితం చేసి 25 లక్షల మందికి అన్యాయం చేసిందని విమర్శించారు. 2023-24లో కేవలం కొంతమందికే ఇచ్చి పిల్లల కడుపు కొట్టారంటూ వైఎస్ జగన్ వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
నేడు కూటమి ప్రభుత్వంలో అదనంగా 17,000 మంది అంగన్‌వాడీల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ పథకంపై గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇచ్చినమాట ప్రకారం హామీ అమలు చేస్తే వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 34.89 లక్షల మంది బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
విద్యార్థులు, రాహుల్‌కు మద్దతుగా ప్రతి రోజు నిరసనలు: జగ్గారెడ్డి
For More AP News And Telugu News