భూములిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా?: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:58 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పదో రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జీరో అవర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పదో రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం అనంతరం జీరో అవర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. డెలివరీ బాయ్‌గా పని చేసిన అనుభవాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశాల్లో బాగా చదువుకున్న యువత సైతం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. మన వద్ద యువత పార్ట్ టైమ్ ఉద్యోగాలంటే చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డెలివరీ బాయ్, పెట్రోల్ బంకుల్లో పని చేయటం ద్వారా ఆదాయం బాగానే ఉంటుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోదాహరణగా వివరించారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో కూడా ఆదాయం సంపాదించ వచ్చని గ్రహించాలంటూ యువతకు కీలక సూచన చేశారు. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఆదాయం పొందేందుకు చొరవ చూపాలంటూ యువతకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హితవు పలికారు.
రేషన్ బియ్యాన్ని కార్డుదారులు తినడం లేదు: ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పొందుతున్న రేషన్ బియ్యాన్ని 90 శాతం మంది బయట అమ్ముకుంటున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని కార్డుదారులు తినటం లేదన్నారు. కార్డుదారుల నుంచి రేషన్ డీలర్లు, దళారులు కొంటున్నారని పేర్కొన్నారు. తద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలంటూ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సూచించారు.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు కంపెనీలు ఏర్పాటయాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. కానీ ఆయా కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలా? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఎస్సాఆర్ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారని కంపెనీ యజమానులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండేలా చూడాలంటూ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
గుంటూరులో నక్షత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే గల్లా మాధవి
తమ నగరంలో నక్షత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక జంతు ప్రదర్శనశాల సైతం అవసరమని తనకు అనిపిస్తోందన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. గుంటూరు వచ్చి తాము పులులు, సింహాలమని చెప్పుకుంటున్నారని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. అందుకే గుంటూరులో జూ అవసరమని తనకు అనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో జూ త్వరగా మంజూరు చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి విజ్ఞప్తి చేశారు.
వినుకొండలో మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్, కాలేజి మంజూరు చేయాలి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
2018లో పీఎం వికాస్ కింద రూ.18 కోట్ల రెసిడెన్షియల్ భవనానికి కేటాయించారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి.. త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 50 వేల మంది మైనార్టీలున్నారన్నారు. మైనార్టీ వర్గాల వాళ్లు మొదటి నుంచి తన వెంట నడుస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తన నియోజకవర్గంలో వెయ్యి మంది మైనార్టీ బాలికలున్నారని గణాంకాలతో సహా ఎమ్మెల్యే ప్రత్తిపాటి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇది అమెరికాకు స్వర్ణయుగం: ట్రంప్
Read Latest AP News and National News