చనిపోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఎందుకు చూపించరు: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:09 PM
సీఎం చంద్రబాబు రంప చోడవరం పర్యటనలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని ఎం. శివాని చనిపోవడం చాలా విషాదం కలిగించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి, జులై 27: సీఎం చంద్రబాబు రంప చోడవరం పర్యటనలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని ఎం. శివాని చనిపోవడం చాలా విషాదం కలిగించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి శివాని మృతిపై సోమవారం రాజధాని అమరావతిలో ఆమె స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదికపై ఉత్సాహంగా మాట్లాడిన శివానీ ఇక లేదంటే నమ్మలేక పోతున్నానని అన్నారు. ఎంతో భవిష్యత్ ఊహించుకుని.. కలలుకన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని పేర్కొన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు బలం కావాలి.. కానీ బలహీనత కాకూడదని వ్యాఖ్యానించారు. కారణాలు ఏమైనా తన కలలు నిజం కాకుండానే విద్యార్థిని తనువు చాలించిందని చెప్పారు.
ఈ విద్యార్థిని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. జీవితంలో సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలని విద్యార్థులు, యువతకు ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు. ఎవరూ ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోనుకా వొద్దని విద్యార్థులను కోరారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు. చనిపోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఎందుకు చూపించరంటూ విద్యార్థులను ప్రశ్నించారు. బతికి ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
అల్లూరి మన్యం జిల్లాలో రంపచోడవరంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శివాని 10వ తరగతి చదువుతోంది. జులై 24వ తేదీన రంపచోడవరంలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శివాని.. తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానని సీఎంకు ఆమె ధీమాగా చెప్పింది. దీంతో ఆ విద్యార్థిని పిలిచి.. సీఎం చంద్రబాబు తన పక్కన కూర్చొబెట్టుకున్నారు. శివాని మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమె మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో కలహాల నేపథ్యంలో శివాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారు: కిషన్ రెడ్డి
Read Latest AP News And Telugu News