స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి వాసంశెట్టి
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:49 PM
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా రాజకీయంగానూ వారికి సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి చెప్పారు.
మరోవైపు, ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదని మంత్రి వాసంశెట్టి స్పష్టం చేశారు. అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ మేరకు 2024 నుంచి వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.32,534 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. నేతన్నల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, చేనేత రంగానికి విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నామని వివరించారు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వాసంశెట్టి గుర్తు చేశారు.
మత్స్యకార కుటుంబాలకూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. వేట నిషేధ సమయంలో వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జీవనోపాధికి అండగా నిలుస్తున్నామని అన్నారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్య ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడమే లక్ష్యమన్నారు. బీసీల హక్కులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థికాభివృద్ధి.. ఈ నాలుగు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులపై చీటింగ్ కేసు
జగన్ హయాంలో నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు.. మంత్రి ధ్వజం