Share News

మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ దంపతులపై చీటింగ్ కేసు

ABN , Publish Date - Sep 27 , 2026 | 08:05 PM

గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్పపై చీటింగ్ కేసు నమోదైంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ దంపతులపై చీటింగ్ కేసు
Cheating Case on Sivakumar

గుంటూరు జిల్లా: తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్పపై చీటింగ్ కేసు నమోదైంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఏపీజే అపెక్స్ కంపెనీకి అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ భార్య పుష్ప డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ నుంచి ఏపీజే అపెక్స్ కంపెనీ రూ.3 కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణానికి తన పేరుతో ఉన్న 1,200 గజాల స్థలాన్ని శివకుమార్ తనఖా పెట్టారు.


అయితే, రుణ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బకాయిలు ప్రస్తుతం రూ.5 కోట్లకు పైగా పెరిగాయి. రుణ బకాయిల రికవరీలో భాగంగా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. తనఖా పెట్టిన 1,200 గజాల స్థలం మొత్తం శివకుమార్ పేరు మీద లేదని గుర్తించినట్లు ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరావు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం ఆయన పేరిట 700 గజాల స్థలం మాత్రమే ఉన్నట్లు తేలిందన్నారు. తనఖా పెట్టిన 1,200 గజాల్లో 500 గజాలను 2012లోనే ఇతరులకు విక్రయించినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు.


ఈ మేరకు ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థను మోసం చేశారంటూ అన్నాబత్తుని శివకుమార్, ఆయన భార్య పుష్పపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 318(4), 338, 336(3), 340(2), 6/W 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైందని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎం చంద్రబాబు విజయవాడ, నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

Updated Date - Sep 27 , 2026 | 08:08 PM