Share News

జూడాల స్టైఫండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:47 PM

జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. వారి సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

జూడాల స్టైఫండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు: మంత్రి సత్యకుమార్

అమరావతి, ఆగస్టు 25: జూనియర్ డాక్టర్ల (జూడాల) డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. జూడాల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జూడాల స్టైఫండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.


హైకోర్టు సూచనల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో జూడా ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశం అవుతుందన్నారు. అయితే తెలంగాణలో స్టైఫండ్ అధికంగానే ఉందని.. ఇతర దక్షిణాది రాష్ట్రాల స్టైఫండ్‌లతో కూడా పోల్చి ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.


జూడాల అభ్యంతరాల నేపథ్యంలో రిటైర్మెంట్ అంశంపై పునఃపరిశీలన చేస్తామని చెప్పారు. నాన్ క్లినికల్ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ నియామకాలపైనా కూడా సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకే నోటిఫికేషన్లు జారీ చేశామని మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో 9,500 మంది జూడాలు కీలక వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. సమ్మె విరమించిన జూడాలకు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 06:55 PM