ఏపీలో యూనిట్లు, జీసీసీలు ఏర్పాటు చేయండి.. వివో, సిస్కో, అబాట్, మాస్టర్‌కార్డ్, శాప్‌కు లోకేశ్ ఆహ్వానం
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:15 PM
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ విదేశీ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు అవుతున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ విదేశీ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు అవుతున్నారు. పలు సంస్థల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు ఉన్న వనరులను వారికి మంత్రి లోకేశ్ సోదాహరణంగా వివరిస్తున్నారు.
వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో మంత్రి లోకేశ్ భేటీ..
ఎలక్ట్రానిక్స్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్, యాక్సెసరీస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
వివో సరఫరాదారుల కోసం ఒక 'కాంపోనెంట్స్ తయారీ పార్క్'ను అభివృద్ధి చేయాలని కూడా ఆయనను కోరారు. దీనిపై అర్జిత్ సేన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని ఈ సందర్భంగా వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ వెల్లడించారు.
సిస్కో ఇండియా ఎండీ హరిశ్ కృష్ణన్‌తో మంత్రి లోకేష్ సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల డిమాండ్‌కు అనుగుణంగా యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్(UCS) సర్వర్లు, స్విచ్‌లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిస్కో ఇండియా ఎండీ హరికృష్ణన్‌కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, కొలాబరేషన్ అండ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఖ్యాతిగాంచిన సిస్కో సిస్టమ్స్ (యుఎస్ఏ) ఎండీ (ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా) హరీశ్ కృష్ణన్‌తో లోకేశ్ సమావేశమయ్యారు.
డేటా సెంటర్ ఎకో సిస్టమ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు (ఎకానమీస్ ఆఫ్ స్కేల్) సాధించడానికి, డేటా సెంటర్ వాల్యూ చైన్ మొత్తం వ్యవస్థను రాష్ట్రంలోకి ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. అలాగే విశాఖపట్నంలో ఇంజనీరింగ్ సెంటర్ / జీసీసీని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో 50వేల మంది యువతను నెట్అకాడ్ యాక్సెస్, ఐటీ, ఇతర పరిశ్రమల్లో అత్యంత నైపుణ్యం గల శ్రామిక శక్తిగా అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వంతో గత ఏడాది మార్చిలో ఒప్పందం చేసుకున్నామని హరీశ్ కృష్ణన్ గుర్తు చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే అమలులో ఉందని తెలిపారు. విశాఖపట్నంలో ఇన్నోవేషన్ సెంటర్, తిరుపతిలో సీఓఈ, విజయవాడ స్మార్ట్ సిటీ, ఏపీ ఫైబర్‌నెట్(22,500 కి.మీ.) ప్రాజెక్టుల్లో తాము భాగస్వామ్యంగా ఉన్నామని అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హరీశ్ కృష్ణన్ వెల్లడించారు.
ఏపీలో వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి: అబాట్ ఇండియా ఎండీకి లోకేశ్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లోని AMTZ / EMCలలో ఓ చోట వైద్య పరికరాలు / డయాగ్నోస్టిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా అబాట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇస్తేయాక్ అంజాద్‌ను మంత్రి లోకేశ్ కోరారు. నక్కపల్లిలో రాబోయే బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పార్క్‌లో అనుకూలమైన భూమి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినియోగ సేవలు, ఇతర రాష్ట్రాలకు మించిన విధానపరమైన మద్దతు ఉంటాయని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో అబాట్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అబాట్ ఎండి అంజాద్ మాట్లాడుతూ... తమ సంస్థ భారత్ లో 400కు పైగా ఫార్మా బ్రాండ్లు, 12వేలకు పైగా ఉద్యోగులను కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం గోవా, బద్ది (హిమాచల్ ప్రదేశ్), ఝగాడియా (గుజరాత్)లలో తయారీ కేంద్రాలు, ముంబై, న్యూఢిల్లీలలో కార్యాలయాలు ఉన్నట్లు వివరించారు. పోషకాహారం (nutrition), ఫార్మా ఉత్పత్తుల కోసం స్థానిక ప్రఖ్యాత సంస్థల్లో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అంజాద్ పేర్కొన్నారు.
స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఆర్‌టిఐహెచ్‌లో భాగస్వామ్యం వహించండి: మంత్రి లోకేశ్
స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం వహించి, వాటిని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)లో ఫిన్‌టెక్ సలహాదారు సభ్యునిగా చేరాలని ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్ (యుఎస్ఏ) వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరిను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. విశాఖపట్నంలో భూమి లభ్యత, ఐటీ, జీసీసీ పాలసీ మద్దతుతో జీసీసీ / టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని లాహిరికి విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో సీఎస్ఆర్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, పీ4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించాలని విన్నవించారు.
మాస్టర్‌కార్డ్ తన 'ప్రైస్‌లెస్ ఎక్స్‌పీరియన్స్'ను రాజమండ్రి, కోనసీమ ప్రాంతంలో అమలు చేసిందని తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ చొరవకు సహకరించిన తొలి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని గుర్తు చేశారు. ఏపీలో మరిన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించాలని ఈ సందర్భంగా లాహిరిని మంత్రి లోకేశ్ కోరారు.
భారత్‌లో పూణె, గుర్‌గాం, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, వడోదరలో కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాస్టర్ కార్డ్ 2వేలమంది ఉద్యోగులను కలిగి ఉందని మాస్టర్ కార్డు వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరి తెలిపారు. 6వేల మంది టెక్నాలజిస్టులతో ప్రపంచంలో అతిపెద్ద టెక్ హబ్‌ను పూణెలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్త “ప్రైస్‌లెస్” ప్లాట్‌ఫామ్ ద్వారా దిండి, తిరుపతి, సూర్యలంక, అరకు / వైజాగ్‌లను ప్రోత్సహించడానికి ఏపీ టూరిజం అథారిటీతో ఎంఓయు చేసుకున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని లాహిరి చెప్పారు.
ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి: SAP వైస్ ప్రెసిడెంట్‌కు లోకేశ్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ గవర్నెన్స్, ఎస్ఎంఇ డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి కోసం డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని శాప్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు SAP నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్‌తో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
భారత్‌లో ఎంటర్‌ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), బ్యాంకులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు తాము సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు శాప్ (SAP) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చనానా చెప్పారు. SAP ల్యాబ్స్ ఇండియా.. ప్రపంచవ్యాప్తంగా SAP రెండవ అతిపెద్ద ఆర్ అండ్ డీ హబ్ అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఇది గ్లోబల్ ప్రొడక్ట్, బిజినెస్ ఏఐ విడుదలకు దోహదపడుతుందని తెలిపారు. బెంగళూరులో కొత్తగా 15వేల సీట్లతో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు: హరీశ్ రావు
Read Latest AP News And Telugu News