Share News

అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:13 PM

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: హోం మంత్రి అనిత
Home Minister Anitha

అమరావతి, మార్చి 01: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. ఆదివారం అమరావతిలో అంగన్‌వాడీ కార్యకర్తలతో హోం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.


కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 86.68 లక్షలు విడుదల చేశామన్నారు. అలాగే ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తద్వారా జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని వివరించారు.


58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్‌ ఫోన్లు అందించామన్నారు. ఈ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంతోపాటు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం.. కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితమని అభివర్ణించారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని హోం మంత్రి అనిత వివరించారు.


గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అప్‌గ్రేడ్ చేస్తోందని భరోసా ఇచ్చారు. అందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి కల్పించి, పూర్తి స్థాయి వేతనాలు అందించనుందని హోం మంత్రి అనిత వివరించారు. అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను కూటమి ప్రభుత్వం నియమించనుందని మంత్రి అనిత వెల్లడించారు.


అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో తొమ్మిదింటిని ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అంగన్‌వాడీలకు ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.


ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తూ, ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దివాళ తీసి వెళ్ళిందని విమర్శించారు. వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని హోం మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 03:27 PM