ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి భారీగా నిధులు: సత్యకుమార్
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:39 PM
ఆయుర్వేద వైద్య సేవల బలోపేతంతోపాటు క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని చెప్పారు.
అమరావతి: ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, డిస్పెన్సరీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆరు జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు రూ.27 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. విశాఖ ఆయుష్ ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2.61 కోట్లు, విశాఖ, కాకినాడ ఆయుష్ ఆసుపత్రుల నిర్వహణకు రూ.1.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 334 ఆయుర్వేద డిస్పెన్సరీలు, 40 కేంద్రాలకు ఉచిత మందులు అందించనున్నట్లు తెలిపారు.
డిస్పెన్సరీల ఆధునికీకరణకు మొత్తం రూ.46.23 కోట్లు కేటాయించామని సత్యకుమార్ చెప్పారు. 150 డిస్పెన్సరీల పనులు పూర్తి చేసేందుకు రూ.28.41 కోట్లు, 64 డిస్పెన్సరీల పునర్నిర్మాణం, డిజిటల్ నెట్‌వర్కింగ్‌కు రూ.12.80 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 55 పంచకర్మ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలకు కూడా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
వృద్ధులు, కీళ్ల వ్యాధుల చికిత్స కోసం 26 కేంద్రాలకు రూ.2.05 కోట్లు, వయోమిత్ర కార్యక్రమానికి రూ.62.40 లక్షలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 8,400 పాఠశాలల్లో ఆయుర్ విద్య కార్యక్రమానికి రూ.6.50 కోట్లు, గర్భిణులు, నవజాత శిశువుల కోసం సుప్రజ కార్యక్రమానికి రూ.8.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. కాకినాడ ఆయుర్వేద కళాశాల అభివృద్ధికి రూ.4.10 కోట్లు, ధర్మవరం నూతన ఆయుర్వేద కళాశాలకు రూ.3.71 కోట్లు, విజయవాడలోని ఎన్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆధునికీకరణకు రూ.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
గుంటూరు జీజీహెచ్‌లో జన్యు పరీక్షల కేంద్రం
గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో క్యాన్సర్ రోగుల కోసం సమగ్ర జన్యు పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటి అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో తొలి దశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు నిర్వహించనున్నారు.
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, రోగికి సరైన చికిత్స అందించేందుకు జన్యు పరీక్షలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కర్నూలులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.120 కోట్లతో క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కోర్టుకు వెళ్లొచ్చు: సత్యకుమార్
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయన్నారు. చట్ట ప్రకారమే డీఎస్సీ నియామకాలు జరిగాయని చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డి కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ అవినీతి పేరుతో రోడ్డెక్కారని మంత్రి విమర్శించారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాప్ కార్యాలయం వద్ద దాడులకు పాల్పడిన వారినే పోలీసులు అరెస్టు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
Also Read:
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా