పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్లకు మంత్రి లోకేశ్ ఆదేశం..
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:42 PM
పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వారికి పలు కీలక సూచనలు చేశారు.
అమరావతి: పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యా ప్రమాణాల పెంపుతోపాటు పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వారికి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండటంతోపాటు, నూతన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను వివిధ పరిశ్రమలతో అనుసంధానిస్తూ, వాటికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ‘నైపుణ్యం’ వెబ్ పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతోపాటు అవసరమైన స్కిల్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, యువత మధ్య సమన్వయం పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు, ఏపీలో అక్షరాస్యత పెంపుతోపాటు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీపైనా విద్యాశాఖ దృష్టి సారించిందని లోకేశ్ తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ రక్షణ చర్యలపైనా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కరిక్యులమ్ మార్పుపై ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యార్థుల్లో భవిష్యత్ నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా విధానంలో అవసరమైన మార్పులు చేపడుతున్నామని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్ దరఖాస్తుకు తొలగిన కీలక అడ్డంకి..