ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:22 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
అమరావతి, ఏప్రిల్ 30: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. హోంశాఖలో కానిస్టేబుళ్లుగా ఉన్న 358 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యాయ శాఖలో 21 పోస్టులు కొత్తగా క్రియేట్ చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో మేనేజర్ పోస్టు కొత్తగా క్రియేట్ చేశామని ఆయన వివరించారు. పంచాయితీ రాజ్ శాఖలో 20 పోస్టులు సప్రస్ చేసి.. అవసరం ఉన్న చోట ఆ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి వచ్చిందన్నారు మంత్రి.
ఆర్ అండ్ బికి సంబంధించి న్యూఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 11.53 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. దీనిని ఎన్‌బీసీసీకి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ భవన నిర్మాణం ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని.. అందులో సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పయ్యావుల తెలిపారు. కొత్త ఏపీ భవనానికి ఏదైనా మంచి పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు.
మున్సిపాలిటీల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పయ్యావుల తెలిపారు. లోకల్ బాడీలలో షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో యూనిఫాం రేటు పెట్టి 7 శాతం పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో మ్యుటేషన్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయని.. వాటన్నింటిని యూనిఫాం పాలసీ కిందకి తీసుకురావాలని ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
కృష్ణానది కరకట్టను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రూ.443 కోట్లతో ఈ కరకట్టను విస్తరించాలని నిర్ణయించామన్నారు. రాజధాని అమరావతిలో ఆఫీసుల కాంప్లెక్స్‌లకు సంబంధించి సెక్రటేరియట్, జీఏడీ టవర్స్, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఏర్పాటుకు రూ.2,540 కోట్ల కేటాయించినట్లు మంత్రి పయ్యావుల వివరించారు. సెల్ అండ్ కోర్ స్ట్రక్చర్ కోసం రూ.1,200 కోట్లు, క్వాంటం వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందన్నారు. ఒక్కొక్కటి 43 టవర్స్ ఉంటాయని.. రెండు టవర్స్‌లోనే అన్నిఫెసిలిటీలు ఉంటాయని చెప్పారు. అసెంబ్లీ బిల్డింగ్‌కు సంబంధించి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ తదితర సౌకర్యాల కోసం నిధులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వివరించారు.
రూ.580 కోట్లతో ఉండవల్లిలో చేపడుతున్న ట్రంక్, అధర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. ఎన్ 10 నుంచి ఎన్ 13 వరకూ జంక్షన్‌కు అండర్ గ్రౌండ్ కేబుల్‌లో రీ రూటింగ్‌కు రూ.100 కోట్లు అదనంగా పెంచామన్నారు. గతంలో సీఆర్డీఏ భూములను ఆర్ 5 జోన్ పేరుతో రెవెన్యూ శాఖకు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. యాన్యుటీ విలువ పెంచాలని రైతులు గతంలో ప్రభుత్వాన్ని కోరారని.. అందుకు కేబినెట్ అంగీకరించిందన్నారు.
సీఆర్డీఏకు కొత్త కేటాయింపులు ఇవ్వడానికి అనుమతివ్వడం జరిగిందన్నారు. సెబీ, స్వామి నారాయణ్, డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చేసిన సిఫార్సుకు ఓకే చెప్పామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 3.57 లక్షలు ఇవ్వనుండగా... ఆర్ అండ్ ఆర్ కాలనీలో కాక బయట కట్టుకుంటామంటే.. భూమికి రూ. లక్ష అదనంగా చెల్లించాలని మంత్రి మండలిలో ఆమోదం తెలిపినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి కేంద్రం భారీగా నిధులు.. స్పందించిన కేంద్ర మంత్రి
సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి
Read Latest AP News And Telugu News