Share News

విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

ABN , Publish Date - Apr 08 , 2026 | 07:36 PM

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతోపాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది.

విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

అమరావతి, ఏప్రిల్ 08: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతోపాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో గురువారం తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో సైతం చినుకులు పడే అవకాశం ఉందంది. ఉరుములు మెరుపుల వచ్చే సమయంలో చెట్ల కింద నిలబడ వద్దని ప్రజలకు స్పష్టం చేసింది.


అలాగే రైతులతోపాటు పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. తూర్పుగోదావరి పైడిమెట్టలో 44 మిమీ వర్షపాతం, డి. పోలవరంలో 37.7 మిమీ, సీతానగరం 32.2 మిమీ వర్షం, పాయకరావుపేటలో 26 మిమీ వర్షపాతం నమోదు అయిందని వివరించింది.


రాయలసీమలో మాత్రం ఎండల ప్రభావం కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు, తిరుపతిలో 42° సిపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరి, చాగలమర్రి, పులివెందులలో భారీగా ఎండ కాసిందని చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41°సి ఉష్టోగ్రతలు దాటినట్లు పేర్కొంది. ఇక ఎండ వేడిమి కారణంగా.. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందంది. ఎండ తీవ్రత నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. నీరు అధికంగా తాగాలని సూచించింది. వాతావరణ హెచ్చరికలతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.


బుధవారం పల్నాడు(జి) క్రోసూరు, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.2°C, చిత్తూరు(జి) నగరిలో 42.1°C, నంద్యాల(జి) చాగలమర్రిలో 41.9°C, కడప(జి)పులివెందులలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.7°C, కర్నూలు(జి) తోవి, మార్కాపురం(జి) అనుములపల్లెలో 41.6°C, ప్రకాశం(జి) చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 07:37 PM