Share News

రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు: విపత్తు నిర్వహణ సంస్థ

ABN , Publish Date - Jun 17 , 2026 | 06:19 PM

తూర్పు విదర్భ - తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అలాగే ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.

రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు: విపత్తు నిర్వహణ సంస్థ
Rains in Andhra Pradesh

అమరావతి, జూన్17: తూర్పు విదర్భ - తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని సూచించింది. బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.


అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేసింది. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రైతులు, కూలీలు, పశువుల కాపరులకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని వివరించింది. విజయనగరం జిల్లా వేపాడలో అత్యధికంగా 96.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 72 మి.మీ, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 69.01 మి.మీ, నర్సీపట్నంలో 66.5 మి.మీ., వజ్రపు కొత్తూరులో 65.8 మి.మీ., నంద్యాల జిల్లా టంగుటూరులో 64.4 మి.మీ., అనకాపల్లి జిల్లా బలిఘట్టం, రావికమతంలో 57.7 మి.మీ., శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 45.2 మి.మీ. వర్షపాతం నమోదైందని వివరించింది. వాతావరణ హెచ్చరికలను గమనించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షాలు, పిడుగుల నేపథ్యంలో అవసరమైతే మాత్రమే బయటకు రావాలని ప్రజలకు ఆ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో వారికే తొలి ప్రాధాన్యం: మంత్రి పొంగులేటి

రుణం చెల్లింపులో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు: చైర్మన్ చలసాని ఆంజనేయులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 06:28 PM