రుణం చెల్లింపులో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు: చైర్మన్ చలసాని ఆంజనేయులు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:32 PM
రుణం చెల్లింపుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కృష్ణాజిల్లా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు రుణం కేవలం రెండున్నర ఏళ్లలో యూనియన్ చెల్లించిందని చెప్పారు.
విజయవాడ, జూన్17: రుణం చెల్లింపుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కృష్ణాజిల్లా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు రుణం కేవలం రెండున్నర ఏళ్లలో యూనియన్ చెల్లించిందని చెప్పారు. ఇది సరికొత్త రికార్డు అని తెలిపారు. బుధవారం విజయవాడలోని మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో కార్మికులు, ఉద్యోగులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ చైర్మన్ మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నమైన ప్రాజెక్ట్ కామధేను విజయవంతంగా సాకారమైందని పేర్కొన్నారు.
వీరవల్లి గ్రామంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో పని చేస్తోందని యూనియన్ చైర్మన్ చెప్పారు. భవిష్యత్తులో 8 లక్షల లీటర్లకు విస్తరించే వీలుందన్నారు. అందుకోసం అత్యాధునికమైన పూర్తి ఆటోమేషన్ ప్లాంట్‌ను రూ.185 కోట్ల అంచనాతో ప్రారంభించామని వివరించారు. కేవలం రూ.163 కోట్ల వ్యయంతో దీనిని పూర్తి చేయడం ఈ యూనియన్‌కు గర్వకారణమని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని 7 సంవత్సరాల కాలపరిమితితో తీసుకున్నామని గుర్తు చేశారు.
కానీ పాడి రైతుల సహకారంతో కేవలం రెండున్నర ఏళ్లలోనే ఈ రుణం పూర్తిగా చెల్లించడం అసాధారణ విజయమని చలసాని ఆంజనేయులు అభివర్ణించారు. ఈ పాల కేంద్రానికి మ్యాక్స్ చట్ట రూపకర్త నందమూరి తారక రామారావు ప్లాంట్‌గా నామకరణం చేశామని తెలిపారు. ఈ ప్లాంట్‌ను కృష్ణా జిల్లా రైతాంగానికి, భవిష్యత్తు తరాలకు అంకితం ఇస్తున్నట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయాణికుడి పాట్లు.. వీడియో వైరల్
అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిత్వ హననానికి దిగజారారు: గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News And Telugu News