Share News

రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయాణికుడి పాట్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:38 PM

భారత్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా సాధారణ రైలు బోగీలను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయాణికుడి పాట్లు.. వీడియో వైరల్

ప్రత్యక్ష నరకం ఏదైనా ఉందంటే జనరల్ బోగీలో ప్రయాణమే. దేశంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తగినట్లు ప్యాసింజర్ రైళ్లలోనే కాదు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా సాధారణ బోగీల (జనరల్ కంపార్ట్‌మెంట్లు) సంఖ్యను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో మామూలు టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుడు.. రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లోకి మహారాజులా ఎక్కేస్తున్నాడు. ఆ రైలు బోగీలోని బాత్రూంనూ ఆక్రమిస్తున్నాడు. ఇలా చాలా మంది రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేస్తున్నారు. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. బాత్‌రూమ్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. తాజాగా అలాంటి సంఘటన బిహార్‌‌లో చోటు చేసుకుంది.


రిజర్వేషన్ బోగీలో బాత్రూంతోపాటు ఆ ప్రదేశం సాధారణ టికెట్‌ ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో బాత్రూంకి వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్న ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అక్కడ కూర్చున్న వారిని పక్కకు జరగాలని కోరాడు. అందుకు వారు ససేమిరా అన్నారు. అలాగే బాత్రూం తలుపు తోశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిని బయటకు రమ్మంటే రాలేదు. అంతేకాకుండా.. వారి నుంచి సదరు ప్రయాణికుడికి బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో కనీసం బాత్రూంకు కూడా వెళ్లకుండా ఉండడం ఏమిటి? అంటూ అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆర్పీఎఫ్‌ లేక టీటీఈని పంపాలని రైల్వే అధికారులను కోరుతూ ఈ వీడియోను రైల్వే శాఖకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు తమకు కూడా ఎదురయ్యాయని గుర్తు చేసుకుని కామెంట్ చేశారు. ఈ వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. సదరు ప్రయాణికుడిని పీఎన్ఆర్ నంబర్‌ పంపాలని కోరింది. ఈ వీడియోను ఆర్పీఎఫ్ అధికారులకు పంపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ టికెట్‌తో ప్రయాణించే వారిని అనుమతించవద్దని అధికారులకు రైల్వే శాఖ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి

Updated Date - Jun 17 , 2026 | 05:06 PM