Share News

దేశవ్యాప్త కమాండో పోటీల్లో ఏపీ పోలీసుల జైత్రయాత్ర.. నాలుగు ప్రతిష్టాత్మక ట్రోఫీలు కైవసం

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:57 PM

ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలోని ఎలైట్ ఫోర్సెస్ అయిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోలు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్‌లోని క్యాంపస్‌లో నిర్వహించిన 16వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ఏపీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది.

దేశవ్యాప్త కమాండో పోటీల్లో ఏపీ పోలీసుల జైత్రయాత్ర.. నాలుగు ప్రతిష్టాత్మక ట్రోఫీలు కైవసం
Andhra Pradesh Police Commandos

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసు విభాగంలోని ఎలైట్ ఫోర్సెస్ అయిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండో(Commando)లు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్‌లోని NSG(నేషనల్ సెక్యూరిటీ గార్డ్) క్యాంపస్‌లో నిర్వహించిన 16వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ఏపీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏకంగా నాలుగు ప్రతిష్టాత్మక ట్రోఫీలతోపాటు పతకాలను సాధించింది. పోటీలన్నింటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఏపీ పోలీసు కమాండో దళానికి ‘ఉత్తమ రాష్ట్ర పోలీసు కమాండో’ ట్రోఫీ దక్కింది. దానితో పాటు షూటింగ్‌లో సత్తా చాటినందుకుగాను ‘బ్లాక్ హాక్ ట్రోఫీ’, దేశంలో ఉత్తమ ఆపరేషనల్ లీడర్ షిప్ కనబరిచినందుకు గాను ‘రణనీతి ట్రోఫీ’, ఓవరాల్ కమాండో పోటీల్లో అద్భుత ప్రదర్శనకు గాను కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.


డీజీపీ అభినందనలు..

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తి, ప్రతిష్టలను పెంచిన కమాండోలను రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల శ్రమ, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో నిబద్ధతతో పని చేసి దేశ రక్షణలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలూ చదవండి:

ఈ క్షిపణితోనే ఖమేనీపై మెరుపు దాడి!

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

Updated Date - Mar 06 , 2026 | 09:08 PM