ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:10 AM
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా ఇద్దరు భారతీయుల ప్రాణాలను బలగొన్నాయి. ఒమన్ గల్ఫ్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేపట్టిన దాడుల్లో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఏడో రోజుకు చేరుకున్నాయి. తాజాగా.. హొర్ముజ్ జలసంధి ఒమన్ గల్ఫ్‌లో స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేసిన దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిహార్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, మహారాష్ట్రలోని ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకిగా గుర్తించారు. అదే నౌకలో పనిచేస్తున్న దలీప్ సింగ్ అనే రాజస్థాన్ వాసి ఆచూకీ గల్లంతైంది.
ఫిబ్రవరి 22న వచ్చిన పలావు జెండాతో కూడిన ఈ ఆయిల్ ట్యాంకర్‌పై ఒమన్‌లోని ముసాందమ్ ఐల్యాండ్ సమీపంలో అనగా ఖసాబ్ ఓడరేవుకు ఉత్తరాన సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 15 మంది భారతీయులు, మరో ఐదుగురు ఇరాన్ వాసులుగా తెలుస్తోంది. దాడి అనంతరం అందులోని సిబ్బందిని ఒమన్ మెరైన్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్‌సీ) అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. అయితే.. ఆ షిప్‌పై ఏ ఆయుధంతో దాడి జరిగిందనే వివరాలు తెలియరాలేదు.
ఈ దాడిలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా.. ఆశిష్ కుమార్ ఈ ఏడాది జనవరి 20న దుబాయ్‌లోని మర్చంట్ నేవీలో చేరారు. ఫిబ్రవరి 22న ఒమన్‌కు వెళ్లే స్కైలైట్ షిప్‌నకు కెప్టెన్‌గా పనిచేస్తున్నారని ఆయన సోదరుడు ఆకాశ్ చెప్పారు. ఇక.. దీక్షిత్ సోలంకి ముంబైలో తన కుటుంబంతో నెలలపాటు గడిపిన అనంతరం ఇటీవలే విధుల్లోకి చేరారు. రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన దలీప్ సింగ్ జనవరి 22న ట్యాంకర్‌లో సిబ్బందిగా చేరారు. అయితే.. దాడి జరిగిన సమయంలో దలీప్ సింగ్ నౌక ముందుభాగంలో ఉన్నట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఇవీ చదవండి: